శ్రీ మహాగణాధిపతయేనమః

శ్రీ మహా సరస్వత్యైనమమః

శ్రీ గురుభ్యోనమమః

శ్రీ తటవర్తి గురుకులం

అవధాన శారదామూర్తి , ప్రఖ్యాత ఆస్ట్రేలియా అవధాని

శ్రీ తటవర్తి శ్రీ కల్యాణ చక్రవర్తి

తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ఎందరో మహానుభావులు, భాషాభిమానులు మాతృభాషా వైభవాన్ని పెంపొందించడానికి చేసిన కృషి వెలకట్టలేనిది. మాతృభాషా మాధుర్యం మాటలలో వర్ణించలేనిది. ఆంధ్రభోజుడిగా, సాహితీసమరాంగణ సార్వభౌముడిగా కీర్తిగాంచిన శ్రీకృష్ణదేవరాయలు తమ ఆస్థాన భువనవిజయంలో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు వంటి అష్టదిగ్గజములనే కాక ఎంతోమంది కవులను పోషించి తెలుగుభాషకు ఎనలేని సేవ చేసారు.
సగటు మనిషికి అంగడిలో కొనవలిసిన నాలుగు వస్తువులు అక్కడకు చేరేసరికి జ్ఞప్తికి రావు. అటువంటిది, వివిధములైన చంధస్సులు, వృత్తపద్యాల నియమాలు, ప్రాస, యతిస్థానము లాంటి వివరాలు మనస్సులో నిక్షిప్తపరచుకొని గణవిభజన మనోఫలకము మీద సాగిస్తూ తప్పులు లేకుండా పద్యం చెప్పుట ఎంతకష్టమో! వీటికి తోడు వివిధములైన పురాణేతిహాస పరిజ్ఞానముతో పృచ్ఛకులను సమాధాన పరచగలిగే వారు, కోటికి ఒకరు. అటువంటి అరుదైన కొద్ది శారదాంబ ముద్దుబిడ్డలలో ఒకరు మా గురువర్యులు శ్రీ శ్రీకల్యాణచక్రవర్తి గారు. అవధాన ధారణా ప్రఛండులు "అవధాన శారదామూర్తి" బిరుదాంకితులు. ఇంతటి విద్వత్తు యుండట మొకయెత్తు, తనకు తెలిసినది ఇతరులకు నేర్పాలనుకోవడం మరొక ఎత్తు. ఈ గురుకులం స్ధాపించి మా అందరికీ చంధోవిద్య నేర్పాలని పూనుకోవటం వారి సహృదయతకు తార్కాణం. వీరితో పరిచయం, ఈ విధంగా శిష్యరికం చేసే భాగ్యం కలగడం మా అందరి పురాకృత పుణ్యఫలం. మా గురువుగారి యెడ నా సరస్వతీ దేవి కరుణ అపారమైయుండాలని, ఆ సర్వజగద్రక్షకుడు వీరిని వీరి కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని మా ప్రార్ధన.
భవధీయుడు
శ్రీనివాసు బృందావనం

సంచికలు (See All)

అవధానాలు

శత శతకయజ్ఞము

పద్యపక్షము

ఎంత మంది పెద్దలు తమ ఇంట అతిథులుగా దేవతార్చన లో యున్నా , మరువక పిల్లల ఆకలి అమ్మలు ఎరిగి, "పంక్తిలో బాలపక్షము"గ వారికి కావలసినంత వారి చిన్న బొజ్జకు నిండా పెట్టెదరు. ఆ అమ్మ నిస్వార్థ ప్రేమయే ఆ పిల్లల అభ్యునతికి హేతువై, శ్రీరామ రక్షై నిల్చునన్నది జగమెరిగిన సత్యము.

ఒకవైపు ఉద్యోగము, మరొక ప్రక్కన తెలుగు సాహిత్య సేవలో , అవధానకవితార్చనలో నిత్యము మునకలైయుండు పెద్దలు, అవధాన శారదామూర్తి శ్రీ శ్రీ కళ్యాణచక్రవర్తి తటవర్తి గారు ఒక గురుకుల విద్యా వ్యవస్థ గా నిలచి దేశవిదేశాలలో నివసించే తెలుగు వ్యాకరణము మరియు చందస్సు లో పసిపిల్లలైన అనేకమంది పెద్దలను, విద్యావేత్తలను, సంగీతకళాకారులను, వైద్యులను,అధ్యాపకులను, విద్యార్థులను, సామాన్య జనపామరులను తమ పిల్లలు గా భావించి తానే అమ్మయై గురువై పద్యపక్షము ద్వారా వారి తెలుగుపద్యార్తిని , కవితార్తిని తీర్చే ప్రయత్నంలో భాగంగా "పద్యపక్షము" అనే శీర్షికతో వారాంతరాలలో వీరందరికీ సాంఘిక మాధ్యమముద్వారా తెలుగు వ్యాకరణము చందస్సు మొదలగు పాఠాలు చెప్పి వారిలో నిద్రాణమైయున్న తెలుగు భాషాభిమానాన్ని , కవితాదృష్టిని , పద్యతృష్ణను తట్టిలేపి వారిచే పద్యశతకాలానే రచింపచేయు శక్తిని, కవితాపటిమను & స్ఫూర్తిని నింపే ప్రయత్నము చేస్తున్నారు. ఇప్పటికే ఈ పద్యపక్షము ద్వారా ఎంతోమంది తమ శతకాలను పూర్తిచేసారు.

ఇంతటి మహాకార్యములో గురుకులాధ్యక్షునకు వీసమెత్తు ద్రవ్యాపేక్ష లేదు సరికదా వారి శతకాలకి కర్తలుగా నిలిపి వీరు సాక్షీభూతమై యుంటారు. తెలుగు , పద్యము కలకాలము మల్లెలై విరియాలని వాటికి సంపూర్ణ పూర్వ వైభవము రావాలని , ముఖ్యముగా యువత మరలా పోతనాది మహానుభావుల పద్యరసగుళికల రుచిని అస్వాదించాలనే భువనమంత స్వార్థము మాత్రము దాగియుంది.

ఈ విధముగా నిస్వార్థ పరమేశ్వర సేవ గా పద్యపక్షము యున్నకారణంగానే నేమో ఇప్పటివరకూ గురుకుల విద్యార్థులు వ్రాసిన పలు శతకాలు ఈశ్వరుడు నేను అందుకున్నాను అని పరిపరి విధములుగా చూపినాడు. శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారి లాంటి మహానుభావుల ముందు మాటలు & వారి అనుగ్రహభాషణం పొందినవి కొన్నైతే , బ్రహ్మశ్రీ చాగంటి వారు & బ్రహ్మశ్రీ సామవేదం వారి అశీస్సులు పొందినవి కొన్నైతే, భధ్రాచల రాముని పాదసన్నిధి చేరినవి కొన్నైతే, సాక్షాత్తూ శంకరుకుల రూపమైన శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారు స్వహస్తాలతో అందుకుని అశీర్వచనములు పొందినవి మరికొన్ని. ఇంతకన్నా నిస్వార్థసేవ కు నిదర్శనమేమి.

అవధానార్చన

తల్లి వాగ్దేవి రూపమే అతి పురాతనమైన అవధానము. ఈ ప్రక్రియ తెలుగుకే తలమానికము అని చెప్పడానికి కూడా కాస్త సాహసించవచ్చు. అవధానమునే ఊపిరిగా చేసుకున్న యోగకవిపండితులూ, ఖండాతరాలలో దీని ఖ్యాతిని విస్తరింపచేసిన మహానుభావులెందరో మనకి సుపరిచితులు.

అవధానము ద్వారా గాయత్రీ కటాక్షము ప్రధానమైన లక్ష్యమైతే, విశేషమైన జ్ఞాపకశక్తి, ఒకేవిషయంపైన దృష్టికేంద్రీకరణ తద్వారా మానసిక తపస్సూ, సాహితీ సేవ, భాషా రసహృదయుల మనసు రంజింపచేయుట, పసికవులను అవధానము వైపు మనస్సు మరలేటట్లు చేయుట దానిద్వారా అవధానము గంగా ప్రవాహము వలే సాగుతూ భావి తరములకందింపచేయుట. అనుషంగిక ప్రయోజనములై నిత్యనూతనమై విరాజిల్లు విద్య మన అవధానము.

వీటికి తోడుగా, ఒక అడుగు ముందుకు వేసి, గోదావరి తటాక కొవ్వూరు వాసి, ఆస్ట్రేలియా నివాసి, తెలుగు పిపాసి, నిస్వార్థ పద్యకవిత విద్యా దానశీలి, సాహితీ అభిమాని , ఆధ్యాత్మిక మార్గ బాటసారి, తటవర్తి గురుకుల రూపశిల్పి , అవధాన శారదా మూర్తి , శ్రీ శ్రీకల్యాణ చక్రవర్తి తటవర్తి గారు వారి గురువులు బ్రహ్మశ్రీ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి విశేష ఆశీర్వచనముతో, ప్రోద్బలముతో , తల్లిదండ్రుల దీవెనలతో , అవధానామునకు కొత్త భాష్యముగా , దీని ద్వారా ప్రాచీన దేవాలయాలు పూర్వవైభవమూ మరింత ప్రాశస్త్యమూ పొందాలనీ వాటిద్వార సమాజము మరింత ధార్మికముగా యుండి ఈశ్వరసేవ వైపు అడుగులువేసి జన్మను సార్థకము చేసుకోవాలనే ఒక గొప్ప సంకల్పముతో, తల్లి సరస్వతీ దేవి ఆజ్ఞతో, ఆశీస్సులతో పురుడుపోసుకున్న కార్యక్రమమే మన "అవధానార్చన" .

అనుస్ఠానమూ, ఉద్యోగమూ, కుటుంబమూ , మరొకవైపు గురుకుల విద్యార్థులకు శిక్షణ , విద్యార్థుల శతక రచనలకు నాంది పలుకుతూ వాటికి మెరుగులు దిద్దితూ …. ఇలా ఎంతో సమయాభావ పరిస్థితులున్నా వారాంతరాలలో వెతికి వెతికి ఒక యజ్ఞముగా ఒకటో ,రెండో, మూడో, నాలుగో దేవాలయాలను చేరుకొని వాటికి అర్చనగా , సేవగా ఆ దేవాలయ పురోహితులనూ, ధార్మికమండలినీ, ఊరిపెద్దలనూ సగౌరవముగా ఆహ్వానించి వారిని వీక్షకులకు పరిచయము చేసి, ఆ దేవాలయ విశేషములను వారిచే చెప్పించి ఆపై తనకూ, గురుకులాని చేతనైన తమవంతు సహాయము చేసి , వీలైనంతమేర ఆ దేవాలయ విశేషాలపై పృచ్చకులు సంధించే ప్రశ్నలకు తనదైన శైలిలో భక్తిని, తనభాషా పటిమను , కాస్త చక్కని సున్నిత హాస్యమును జోడించి పద్యకవితలను బదులుగా చెప్తూ, పదిమందికీ ఆదర్శమై నిలిచే ప్ర్యత్నమే ఈ మన అవధానార్చన.

కవన విజయము

సాహితీ సమరాంగణ సార్వభౌముడు , ఆంధ్రభోజుడు విజయనగర చక్రవర్తి శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి భువనవిజయము అణువణువూ నిండినిమిడీకృతమైన ప్రేరణే తటవర్తిగురుకుల వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీ శ్రీకల్యాణచక్రవర్తి తటవర్తి వారి ఆలోచనలో విరిసిన పుష్పసౌరభమే ఈ కవనవిజయము.

గురువుగారి శిక్షణలో భాగంగా పెద్దలచే రచియింపబడిన పద్యమాలలను అధ్యయనము చేసి ఎన్నో విషయాలను, భాషాపటిమను నేర్చుకుంటూ అప్పడప్పుడూ గురుకులం పసికవులను ప్రోత్సహించే పనిలో భాగంగా వీరు కవనవిజయమను కార్యక్రమమును నిర్వహిస్తూఉంటారు. ఇందులో విశేషమేమంటే గురుకులం కవులందరూ సందర్భానుసారంగా వారే వ్రాసుకున్న పద్యాలను కాస్త హాస్యమును, భావుకత మేళవించి చెప్పేప్రయత్నం చేస్తున్నారు.

దీనిద్వారా వీరు మరింత ఉత్సాహము పొందడము ఒక ఎత్తైతే, ఇలాంటి కార్యక్రమాలు చూసి పలువురు పద్య శిక్షణకు ముందుకురావడం మరొక ప్రయోజనము తద్వారా భాష, భానుని వలే నిరంతరము ప్రకాశించుచు భాషాభిమానము ఫరిడవిల్లునని నమ్మకము.

ఇంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఎదో ఒక సేవ సంస్థను పిలచి వారి సేవలను పరిచయంచేసి వారి మరింబ ఆర్థిక పరిపుష్టిని సమకూర్చి తద్వారామరిన్ని విజయాలను వారు కూదా పొందే ప్రయత్నము చేయడము ప్రధాన ప్రయోజనము. అలా జరిగిననాడు కవనవిజయానికి నిజమైన విజయమని నమ్ముతూ...

సర్వేజనఃసుఖినోభవంతు

కావ్య గురుదక్షిణ

"దక్షతే పరకార్యం శీఘ్రం కరోతీతి దక్షిణః దక్ష వృద్ధౌ శీఘ్రార్థేచ" అని "దక్షిణ" ని అమరకోశము వ్యాఖ్యానించింది. అనగా పరప్రయోజనము శీఘ్రముగా జేయువాడు అని అర్థము.

ఇదే స్పురణతో శిష్య ప్రయోజనమైన జ్ఞానము కొరకు తపించి దానిని శీఘ్రముగా ఒనగూర్చేవాడు గురువు. ఆ గురువు అవధాన శారదామూర్తి శ్రీ శ్రీ తటవర్తి కల్యాణ చక్రవర్తి తమ శిష్యులకు గురులఘువులు, చందస్సు, వ్యాకరణము పద్యవిద్యామెళుకువులు తదితర అంశములను జాతి కుల మత లింగ వయో బేధములు లేక నేర్పి ఆపై వారిచేత శతకరచనకు నాందిపలికించి వెన్నుదన్నుగ నిలచి శతకమును పూర్తిచేయించి తిరిగి ఆ శతకమును ఏ స్వార్థమూ లేక, ఏ రకమైన భౌతిక ప్రయోజనమునూ ఆశించక భగవతార్పితము కావలెనని అదియే ఆ శతకమునుకూ ఆ విద్యార్థి ఉన్నతికి శ్రేష్ఠమని తలచి గురుబోధ చేసి పెద్దలైన గురువులనో, లేక వీరు చదవుకున్న పూర్వ పాఠశాల ఉపాధ్యాయులనో అహ్వానించి వారి చేతులమీదుగా వారి అశీస్సులతో, బంధు మిత్ర ఆశ్రితుల సమక్షంలో , వేదాశీర్వచనములతో ఆ శతకములు "కావ్యగురుదక్షిణ" గా నిలుపబడుతున్నాయి.

ఈ విధముగా ఇప్పటికే జననీ, హరీశ్వరా, సాయినాథ, ఇత్యాది శతకములనేకము రూపుదిద్దికున్నవి. ఇదే మార్గమున మరికొంతమంది కవుల శతములు, గురువు పంచు సోమరస ఔషధబలముతోడ కలువలవలె విచ్చుకొనే ప్రయత్నము చేయుచుంటివి.

ఏమార్గమైనా చివరకి ఈశ్వర పాదములు చేరుటకొరకే కదా. మన గురుకులమెంచుకున్న మరియొక శ్రేష్ఠమైన మరియు విశిష్ఠమైన మార్గమిది. ఈ మార్గము కూడా కైవల్యపదమై ఆ బ్రహ్మమునుచేర్చునని సంపూర్ణముగా విశ్వసిస్తూ.. ..

సర్వేజనాఃసుఖినోభవంతు.